![]() |
![]() |

ఈమధ్య సినిమా పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. నిర్మాతలు తమ దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని రకరకాల గిఫ్టులతో ఖుషీ చేస్తున్నారు. తాము తీసిన సినిమాలు హిట్ అయి లాభాలు ఆర్జిస్తే లక్షల నుంచి కోట్లు విలువజేసే లగ్జరీ వాచెస్, లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. తెలుగులో ఇటీవలే బేబీ సినిమా సాధించిన విజయానికి గుర్తుగా డైరెక్టర్ సాయిరాజేశ్‌కి నిర్మాత ఎస్.కె.ఎన్. ఒక లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడంతో నిర్మాత కళానిధి మారన్ ఏకంగా హీరో, డెరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కి కూడా లగ్జరీ కార్లు బహుమతులుగా ఇచ్చారు. ఎవరు ఏ బహుమతి ఇచ్చినా ఇప్పటివరకు అది రిలీజ్ తర్వాతే జరిగింది.
ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. తమ సినిమా రిలీజ్ అవ్వకముందే దర్శకుడికి రూ.5 కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు నిర్మాతలు. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘యానిమల్’ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే సందీప్‌రెడ్డి వంగాకు నిర్మాత భూషణ్‌కుమార్ రూ.5 కోట్ల విలువచేసే అత్యంత లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడట. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ వార్త ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి బహుమతులు ఇస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, విడుదలకు ముందే ఇలాంటి కారు గిఫ్టుగా ఇవ్వడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ‘అర్జున్‌రెడ్డి’తో తెలుగులోనే కాదు, హిందీలో ‘కబీర్‌సింగ్’తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు ‘యానిమల్’తో మరో బ్లాక్‌బస్టర్ సాధిస్తాడని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
![]() |
![]() |